క్రమశిక్షణ, నిబద్ధతతో లక్ష్య సాధనకు కృషి చేయాలి.
ఉద్యాన కళాశాల సహ సంచాలకురాలు డా. వీణా జోషి.
పెద్దమందడి,సెప్టెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సహ సంచాలకురాలు డా. వీణా జోషి బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలోని క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల, నిరంతర కృషి, సమాజ సేవా భావం నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. ప్రజా సంక్షేమం, సమాజ అభివృద్ధి కోసం ఆయన చూపిన అంకితభావాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ తరగతులు, ప్రయోగాత్మక బోధన, ఇతర విద్యా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. సమయపాలన, బాధ్యతాయుత ప్రవర్తన, నిరంతర కృషి భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.విద్యార్థులు తమ విద్య, నైపుణ్యాలను వ్యక్తిగత అభివృద్ధితో పాటు రైతులు, సమాజం, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని ఆమె సూచించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల, సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు ఒప్పంద సిబ్బంది, పట్టభద్ర విద్యార్థులు, డిప్లొమా విద్యార్థులు పాల్గొన్నారు.


Comments