కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు.
హుజురాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు.
హుజురాబాద్,సెప్టెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు ):
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను హుజురాబాద్ పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని హనుమకొండ రోడ్డులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డగా జన్మించడం పద్మశాలి కుల బాంధవులందరికీ గర్వకారణమన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యునిగా ఎదిగిన ఆయన, ప్రజలకు న్యాయం చేయాలనే ఆశయంతో న్యాయవాద వృత్తిని చేపట్టి, నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయపరంగా అండగా నిలిచారని కొనియాడారు.
చేనేత, సహకార రంగాల అభివృద్ధికి కృషి
చేనేత, సహకార రంగాలకు న్యాయం జరిగేలా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సహకార ఉద్యమానికి అండగా నిలిచారని జనార్ధన్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆయన ఆదర్శ పురుషుడని అన్నారు.
తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం
1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధన కోసం దీక్షలు చేపట్టి ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పద్మశాలి యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడప రాజు, మంద రమేష్, చిలుకమారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, కుడికాల భాస్కర్, సంగెం భాస్కర్, కొండా గణేష్, మండల యాదగిరి, కుడికాల సాయి, ఇప్పనపల్లి చంద్రశేఖర్, ఆడెపు సూర్యం, మంద బిక్షపతి, మండల సేకరయ్య, గంజి జయవర్ధన్, సంగం భాస్కర్, సంగం ఐలయ్య, సంగం శ్రీనివాస్, చిక్స్ సంఘం శ్రీనివాస్, మెడికల్ కడవెరుగు సత్యం, గాలి సమ్మయ్య తదితర పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments