ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ఖిల్లా ఘణపురం,సెప్టెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలోని ఘనపురం ఖిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనపురం ఖిల్లా వద్ద నిర్వహించిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘనపురం ఖిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, ఇక్కడి కట్టడాలు పూర్వీకుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఖిల్లా అభివృద్ధికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు, అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.వనపర్తి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానిక ప్రాంతాలకు గుర్తింపు రావడంతో పాటు యువతకు చరిత్రపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలోని చారిత్రక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు, యువతలో చరిత్ర, వారసత్వ సంపదపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు.అనంతరం వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, డీవైఎస్‌ఓ సుధీర్ రెడ్డి, సీపీఓ హరికృష్ణ, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments