అక్షరమే ఆయుధం.. నిరక్షరాస్యతపై సమరం.
జమ్మికుంట, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి ఒక్కరికీ అక్షరజ్ఞానం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిరక్షరాస్యులకు పరీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 3,770 మంది నిరక్షరాస్యులను గుర్తించగా, ఆదివారం 2,842 మందికి పరీక్ష నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. విద్య నేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని, ప్రతి ఒక్కరూ అక్షరజ్ఞానం పొందడం ద్వారా నిత్యజీవితంలో స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు ఆధునిక సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించగలరని అన్నారు. అక్షరాస్యతతోనే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, ఇన్విజిలేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్షరాస్యత లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్మన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దిడ్డి రాము, మెప్మా సిబ్బంది జ్యోతి, మంజుల, విజయ, దేవేంద్రతో పాటు పలువురు ఆర్పీలు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.


Comments