భగత్ సింగ్ ఆశయాలే యువతకు మార్గదర్శకం.
*దేశాభివృద్ధి, సమాజ సేవలో యువత ముందుండాలని మేయర్ పిలుపు*
*షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకల్లో ఘన నివాళులర్పించిన మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్‌లో షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీగలగుట్టపల్లి మేయర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మాతృభూమి విముక్తి కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన త్యాగం, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో యువతలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు.
భగత్ సింగ్ 23 ఏళ్ల వయస్సులో చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశాభివృద్ధి, సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నిఫా రాష్ట్ర కోఆర్డినేటర్ కే. యాదవ రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments