బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు
జాతీయస్థాయి విశ్వ కళ విభూషణ్
హనుమకొండ,సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రజాకవి, రచయిత, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వగురువు, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, వివిధ అంతర్జాతీయ, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌ను జాతీయస్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
హనుమకొండ బస్టాండ్ సమీపంలోని పద్మాక్షి ఆవరణలో గల జయకృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ తదితర సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ నాగుల సత్యం గౌడ్ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు, సాహిత్య రచనలు, మానవ విలువల పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఆయనను విశ్వ కళ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ కళ విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణాచార్య, ప్రపంచ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్య నటులు ఆర్ఎస్ నంద, ప్రముఖ సినీ నటి నువ్వు ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. సామాజికవేత్తలు వనపర్తి పద్మజ, మల్లికార్జున్, సాజనాటి గుంటుక రాధిక, ప్రముఖ న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, సామాజిక సేవకులు, కరీంనగర్ భూమి తెలుగు దినపత్రిక ఎడిటర్ బిడ్డల ప్రశాంత్, వివిధ సంస్థల వ్యవస్థాపకులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళా రత్న శ్రీ అక్కనపల్లి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, ముఖ్య అతిథులు కలిసి డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు పట్టు శాలువా కప్పి, మెడల్, గురు కిరీటం ధరింపజేసి, జ్ఞాపిక అందజేసి విశ్వ కళ విభూషణ్ పురస్కారాన్ని ఘనంగా ప్రదానం చేశారు.
సత్యం గౌడ్ సేవలు అభినందనీయం
ఈ సందర్భంగా పోలోజు రాజ్‌కుమార్‌తో పాటు ముఖ్య అతిథులు మాట్లాడుతూ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు, సాహిత్య రచనలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆధ్యాత్మికత, మానవ విలువలు, సమాజ శ్రేయస్సుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తనదైన శైలిలో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అపారమైన జ్ఞానాన్ని సమాజ ప్రయోజనానికి వినియోగించడం అభినందనీయమన్నారు.
అలాగే ఎందరో కళాకారులు, ఆర్టిస్టులు, నృత్య కళాకారులు, కవులు, రచయితలు, సామాజికవేత్తలను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు వివిధ అవార్డులు, రివార్డులు, సత్కారాలు అందిస్తున్న పోలోజు రాజ్‌కుమార్ సేవలను కూడా వారు అభినందించారు.
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం
అనంతరం పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మనసును అదుపులో ఉంచుకొని, మనసును నిర్మలంగా చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మనుషులు ఒకరికొకరు నష్టం చేసుకోకుండా పరస్పరం సహకరించుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని మానవత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మనిషికి లభించిన మంచి మనసును సత్ప్రయోజనాలకు, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
యువత దేశానికి పునాది
సమాజానికి, దేశానికి యువత, విద్యార్థులు మూలస్తంభాల వంటి వారని సత్యం గౌడ్ అన్నారు. ప్రతి విద్యార్థి విద్యలో రాణించి ప్రయోజకుడిగా ఎదిగి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని, సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి లోక కళ్యాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. మానవత్వం, సేవా భావం, ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సామాజికవేత్తలు, గురువులు, కళాకారులు, కవులు, రచయితలు, డాన్స్ మాస్టర్లు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు, నటులు, నృత్య కళాకారులు, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments