వైద్యం అందక పల్లె ప్రజల అవస్థలు.
సైదాపూర్ పీహెచ్‌సీలో వైద్యుడి గైర్హాజరుపై గ్రామస్థుల ఆగ్రహం.
సైదాపూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యుడు డా. కృష్ణకుమార్ విధులకు సక్రమంగా హాజరు కాకుండా కేవలం రిజిస్టర్‌లో సంతకాలకే పరిమితమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో సైదాపూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా అధికారులు వెన్నంపల్లి పల్లె దవాఖానలో పనిచేస్తున్న డా. కృష్ణారావును సైదాపూర్‌కు రప్పించినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం కారణంగా వెన్నంపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి గ్రామాల్లో వైద్యుడు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
చిన్నపాటి అనారోగ్య సమస్యలకూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు మరో ప్రాంతంలోని వైద్యుడిని తరలించడం వల్ల రెండు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు అంటున్నారు.
వైద్యుడి విధుల గైర్హాజరుపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వెన్నంపల్లి పల్లె దవాఖానకు డా. కృష్ణారావును తిరిగి పంపించి, ఆయా గ్రామాల ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Comments