ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ బడుల నిర్వహణ ఇదేనా?
వేలాడుతున్న బోర్డును చూసినా పట్టించుకోని అధికారులు.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాఠశాల ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ఊడిపోయి కిందకు వేలాడుతూ సుమారు రెండు నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ చిన్నారులు పాఠశాలకు రాకపోకలు సాగించే ప్రవేశద్వారం వద్దే బోర్డు ప్రమాదకరంగా వేలాడుతూ ఉంది. గాలికి బోర్డు ఊగుతుండటంతో ఎప్పుడైనా ఊడిపడి విద్యార్థులకు తగిలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు కనీసం స్పందించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా పరిస్థితి ఇలాగే ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించాల్సిన సమయంలో, చిన్నారులకు ప్రమాదకరంగా మారిన బోర్డును సకాలంలో తొలగించి మరమ్మతులు చేయకపోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్ర
మాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి, బోర్డును వెంటనే తొలగించి సురక్షితంగా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.


Comments