కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం.
*మొన్న బీజేపీ నీటి విడుదలపై డ్రామా.*
*నిన్న బీఆర్‌ఎస్ మున్సిపల్ ముట్టడి పేరుతో హడావుడి*
*మునిగిపోతున్న రెండు నావల్లోకి చేరికల ప్రచారమంతా బూటకమే*
*రెండు పార్టీలపై కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధ్వజం*
కరీంనగర్, అక్టోబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
నగరంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఇరవై ఏళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ రెండు పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు. గత పాలకవర్గంలో జరిగిన అవినీతిని నేడు బీఆర్‌ఎస్ నేతలే అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు.
రెండు పార్టీల రాజకీయాలు నాటకాలు, బూటకాలేనని విమర్శించిన ఆయన, గత మున్సిపల్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రెండు పార్టీలు రాజకీయంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని, ఆ పార్టీల్లోకి జరుగుతున్న చేరికల ప్రచారంలో వాస్తవమెంత అన్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇటీవల బీజేపీ నీటి విడుదల అంశంపై ఆందోళన చేపట్టగా, మరుసటి రోజు బీఆర్‌ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి యత్నించడాన్ని ఆయన రాజకీయ డ్రామాలుగా అభివర్ణించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపకుండా పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.
బీజేపీ పాలకవర్గం ప్రజా సమస్యలను పట్టించుకోకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇకపై ఇలాంటి రాజకీయాలు సాగవని ఆయన వ్యాఖ్యానించారు.


Comments