డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
*డంపింగ్ యార్డును తనిఖీ చేసి పరిశీలన.*
*డంపింగ్ యార్డులో మంటలు, పొగను అదుపు చేసేందుకు తక్షణ చర్యలు*
*స్వచ్ భారత్ మిషన్ రూ.17 కోట్లతో బయోమైనింగ్, యూసిఎఫ్ రూ.80 కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్.*
*కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో సమస్యకు శాశ్వత పరిష్కారం-మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, అక్టోబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
దశాబ్దాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డును శనివారం పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ఆయన సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలు, పొగను అదుపు చేసేందుకు మేయర్ అక్కడే ఉండి తక్షణ చర్యలు చేపట్టారు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్లకు మోటార్ ప్రెషర్ పంపులను అమర్చి మంటలను అదుపు చేయించారు. పూర్తిస్థాయిలో మంటలు, పొగను నియంత్రించేందుకు సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి మంటలను పూర్తిగా ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. గత 40 నుంచి 50 ఏళ్లుగా డంపింగ్ యార్డులో ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పొగ, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ సమస్యకు ముగింపు పలకడమే తమ పాలకవర్గం ప్రధాన లక్ష్యమన్నారు.
*రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులు*
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని మేయర్ తెలిపారు. త్వరలోనే నాలుగు యంత్రాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు నుంచి ఏడు నెలల్లో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్తగా ప్రతిరోజూ వచ్చి చేరుతున్న చెత్త కారణంగా గతంలో స్మార్ట్ సిటీలో ప్రారంభించిన బయోమైనింగ్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. మరో రూ.20 కోట్ల నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
*సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు రూ.80 కోట్లు*
బండి సంజయ్ కుమార్ చొరవతో కరీంనగర్‌ను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో చేర్చి రూ.840 కోట్ల నిధులు మంజూరయ్యాయని మేయర్ తెలిపారు. ఇందులో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద రూ.80 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం పేరుకుపోయిన చెత్తను తొలగించడంతోపాటు, ప్రతిరోజూ కొత్తగా వచ్చే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా చర్యలు తీసుకుంటామని, ఏడాదిన్నర వ్యవధిలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అవసరమైన నిధులు సమకూర్చుకుని డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు నగరంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, పిపిఏ చంద్ర, తోట అనిల్, మేకల వెంకటేశ్వర్లు, శెట్టి వసంత లక్ష్మీ భూమయ్య, నాయకులు బండారి గాయత్రి, వెంకట్ రెడ్డి, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments