అక్టోబర్ 13 నుంచి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
-- జిల్లా కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్
వనపర్తి,అక్టోబర్10(తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఈ నెల 13 నుంచి వనపర్తి జిల్లావ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్ తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నో ఏళ్లుగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పలుమార్లు నిరసనలు తెలిపి వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం బాధాకరమన్నారు.దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, ఇతర భత్యాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు.


Comments