సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం.
వరంగల్‌లో 60 మందికి పైగా జర్నలిస్టులకు లయన్స్ క్లబ్ ఘన సత్కారం
డీఎస్ జగన్, రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు
వరంగల్,అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయుల కృషి మరువలేనిదని రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు డీఎస్ జగన్ అన్నారు. వరంగల్ ప్రెస్ వేదికగా లయన్స్ క్లబ్ 320 ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జర్నలిస్టుల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీఎస్ జగన్ మాట్లాడుతూ, వరంగల్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో జర్నలిస్టు మిత్రుల నుంచి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎన్నో విలువైన సూచనలు స్వీకరించానని తెలిపారు. వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకారం అందిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతం కావడంలో జర్నలిస్టుల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. నాటి తరం, నేటి తరం జర్నలిస్టులు ఒకే వేదికపై కలుసుకోవడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.

సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ మాట్లాడుతూ, వరంగల్‌లో జిల్లా పౌర సంబంధాల అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన తనకు జర్నలిస్టులతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. జిల్లాలో కనుమరుగవుతున్న కళారంగ సంస్థలను ప్రోత్సహించేందుకు కాకతీయ కళా వైభవం, శతరూప వంటి కార్యక్రమాలను నిర్వహించిన సందర్భాలను గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలులో పాత్రికేయుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. వరంగల్‌లో సహాయ ప్రజా సంబంధాల అధికారిగా ప్రారంభమైన తన ప్రస్థానం మూడు దశాబ్దాలపాటు కొనసాగిందని, ఈ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.సమాచార శాఖ పూర్వ సంయుక్త సంచాలకులు మనోహర చారి మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత లయన్స్ క్లబ్ కార్యక్రమం ద్వారా వరంగల్‌కు వచ్చే అవకాశం కలిగిందని, ఇందుకు సీనియర్ జర్నలిస్టులే కారణమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
జర్నలిస్టుల సేవలకు గుర్తింపుగా సత్కారం
లయన్స్ జిల్లా గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా సమాజానికి సేవలందించే జర్నలిస్టులు, వైద్యులు, ఇంజినీర్లను సత్కరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి కార్యక్రమ కమిటీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పి.వి. మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు 60 మంది జర్నలిస్టులతో పాటు పూర్వ జిల్లా పౌర సంబంధాల అధికారులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో జిల్లా పౌర సంబంధాల అధికారులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు.
కార్యక్రమ కమిటీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు లయన్ పి.వి. మదన్ మోహన్ మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాల జర్నలిజం ప్రస్థానంలో ఎంతోమంది జర్నలిస్టులు తనతో సోదరభావంతో మెలిగారని తెలిపారు. వారందరినీ ఒకే వేదికపై కలుసుకోవాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. తన మానసపుత్రిక అయిన ప్రెస్ వేదిక ద్వారా పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఆకాశవాణి విలేకరిగా ప్రారంభమైన తన ప్రస్థానంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేశారు. పాత్రికేయుల కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటు, సొంత భవనానికి స్థలం సమకూర్చుకోవడం, భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్టులు, అధికారులకు ఘన సత్కారం
లయన్స్ క్లబ్ 320 ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తున్న సీనియర్ పాత్రికేయులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన సమాచార శాఖ అధికారులను ఘనంగా సత్కరించారు. విశేష సేవలందించిన జర్నలిస్టులను గుర్తించి గౌరవించడం ద్వారా వృత్తిపట్ల గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో విడీజీ-1 రమణారెడ్డి, ప్రజా సంబంధాల అధికారి అజీత్, చీఫ్ కోఆర్డినేటర్ టి. నరేందర్, పీడీజీలు కన్నా, పొట్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, నరహరి, పరికిపండ్ల వేణు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు కేశవమూర్తి, లెనిన్, అనిల్, సదయ్య, సుధాకర్, రాజనారాయణ, రమణ, గుల్షన్, సోని, దయాసాగర్, రవీందర్ రావు, కేకే, కృష్ణమోహన్, పెద్దీశ్, రాజేంద్రప్రసాద్, మనోహర్ రావు, వెంకటరత్నం, సాయిరాం, యంసాని శ్రీనివాస్, వంశీమోహన్ తదితరులను సత్కరించారు. సుదీర్ఘకాలంగా ఫొటో జర్నలిస్టులుగా సేవలందిస్తున్న సకినాల శ్యాం, దాసరి శ్రీనివాసులును మదన్ మోహన్ అభ్యర్థన మేరకు సంస్థ ప్రత్యేకంగా సన్మానించింది. సీనియర్ జర్నలిస్టు లయన్ పెండెం వేణుమాధవ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


Comments