పల్లెపల్లెనా పూల జాతర!
ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
సర్పంచులు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంబరాలు.
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మండలంలోని పల్లెల నుంచి పట్టణంలోని వీధుల వరకు ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. దీంతో గ్రామాలు, పట్టణ వీధులు పూల సోయగాలతో కళకళలాడాయి.మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించగా, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో కౌన్సిలర్ల నేతృత్వంలో సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు సమన్వయంతో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మలను అందంగా పేర్చి, ఒకచోట చేర్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆటలాడారు.
మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్ పరిశీలించి, మహిళలతో కలిసి వేడుకలను తిలకించారు. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా 11వ వార్డులోని చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నీల రాజమ్మ పాల్గొన్నారు. మహిళలతో కలిసి పండుగ సంబరాలను తిలకించారు.పండుగను పురస్కరించుకుని సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. మహిళలు, చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ వస్త్రధారణలో మహిళల సందడి, బతుకమ్మ పాటలతో పట్టణం పండుగ కళను సంతరించుకుంది.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించడం తెలంగాణ ప్రత్యేకత. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబరాలు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా కొనసాగనున్నాయి.
ఈ వేడుకల్లో గ్రామాల సర్పంచులు మందపురం రాణి అనిల్, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పనికెర సోమేష్, పురమాని కోమల ఐలోని, మంతెన హరిత ఇంద్రారెడ్డి, పోలేపల్లి సంపత్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు తాటికొండ మధు, గుర్రం హరినాథ్, గుర్రము హైమావతి రమేష్, చల్ల రమ్య రఘురెడ్డి, బూర్ల రాజేశ్వర్, బలగాని అనిల్, పొన్న రాజేష్, సౌదరపల్లి సంపత్, తోకల అనుష రాజు, గట్టు సంగీత రమేష్, కృష్ణవేణి సారయ్య, బొల్లు లక్ష్మి, అంగడి రజిత కృష్ణ, పొన్నం స్వరూప రాజయ్య, పొన్న రవి తదితరులు పాల్గొన్నారు.


Comments