కోరపల్లి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన విద్యార్థులు
* కోలాటాలు, నృత్యాలతో సందడి
జమ్మికుంట, అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో జమ్మికుంట మండలం కోరపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, కోలాటాలు, నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారిణి మంథని హేమలత మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా, ఆకర్షణీయంగా నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన కార్యక్రమం (ఎఫ్‌ఎల్‌ఎన్)లో భాగంగా రూపొందించిన స్టాండీని ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దబ్బేట రవీందర్ మాట్లాడుతూ.. సీనియర్ ఉపాధ్యాయుడు గుడిమిల్ల బలరాం తన సృజనాత్మకతతో రూపొందించిన ఎఫ్‌ఎల్‌ఎన్ స్టాండీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. దీని రూపకల్పనలో సహకరించిన ఉపాధ్యాయినులు సంగసాని కుమారి, సైని శైలజ, గొర్ల రేఖలను అభినందించారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పూలతో బతుకమ్మలను పేర్చడం ద్వారా పిల్లల్లో కళాత్మక నైపుణ్యాలు పెంపొందడంతోపాటు ప్రకృతి, పర్యావరణంపై అవగాహన కలుగుతుందని తెలిపారు. సంప్రదాయ పండుగల ద్వారా చిన్నారులకు మన సంస్కృతి, వారసత్వ విలువలను చేరువ చేయవచ్చన్నారు.
ఈ వేడుకల్లో సీఆర్పీ గుర్రప్ప, అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు రమ, భాగ్యరేఖ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments