ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు సమాన స్టైఫండ్ చెల్లించాలి.
సమాన పని – సమాన స్టైఫండ్ మా నినాదం.
కరీంనగర్, అక్టోబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ మోసిన్, డాక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లు తమ సమస్యలను వివరిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెగ్యులర్ ఎంబీబీఎస్ ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, స్టైఫండ్ చెల్లింపుల్లో తమ పట్ల వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోగులకు సేవలందించేందుకు, ఇంటర్న్‌షిప్ విధులను బాధ్యతగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు కావాల్సిందల్లా న్యాయమైన, సమానమైన స్టైఫండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. “సమాన పని – సమాన స్టైఫండ్” అనే నినాదంతో తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం వర్తించే ఇంటర్న్ స్టైఫండ్ నెలకు రూ.29,792 కాగా, ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు కూడా అదే స్థాయిలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, జనవరి 2026 నుంచి అర్హత ఉన్న కాలానికి సంబంధించిన పెండింగ్ స్టైఫండ్ మొత్తాన్ని కూడా చెల్లించాలని కోరారు.
ప్రస్తుతం చాలామంది ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు ఎలాంటి స్టైఫండ్ అందడం లేదని, మరికొందరికి నెలకు కేవలం రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను గత నాలుగైదేళ్లుగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పోరాటం ఏ వ్యక్తికీ, వ్యవస్థకీ వ్యతిరేకం కాదని, కేవలం న్యాయమైన హక్కుల సాధన కోసమేనని వారు స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి, ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు సమాన స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Comments