ఉద్యోగుల పెన్షన్‌పై ద్వంద్వ వైఖరి తగదు.
పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు.
వనపర్తి,అక్టోబర్10(తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగుల పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం సరికాదని వనపర్తి జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో డా. జయప్రకాష్ నారాయణ రాసిన వ్యాసంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రజలకు సేవ చేసిన అనంతరం వృద్ధాప్యంలో గౌరవంగా జీవించేందుకు పెన్షన్ కోరడం వారి హక్కు అని పేర్కొన్నారు. పెన్షన్ అనేది దానం కాదని, దీర్ఘకాలిక సేవకు లభించే సామాజిక భద్రత అని స్పష్టం చేశారు.దేశ ఆర్థిక పరిస్థితికి పెన్షన్ ఒక్కటే కారణమన్నట్లు చిత్రీకరించడం సరికాదని, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ అప్పులు, వడ్డీ చెల్లింపులపైనా సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు. ప్రజాప్రతినిధుల పెన్షన్ల విషయంలో ఒక వైఖరి, దశాబ్దాలపాటు సేవ చేసిన ఉద్యోగుల పెన్షన్ విషయంలో మరో వైఖరి ప్రదర్శించడం తగదని విమర్శించారు.కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రత, హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఉద్యోగుల సేవలను గుర్తించి, వారి వృద్ధాప్య జీవితానికి భరోసా కల్పించేలా ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే పునరుద్ధరించాలని పలుస శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.


Comments