సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
* డిగ్రీ కళాశాల మైదానం, నాయిని చెరువు వద్ద పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
జమ్మికుంట, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పట్టణంలోని 30 వార్డులకు చెందిన మహిళలు, అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, నాయిని చెరువు వద్ద చేపట్టనున్న ఏర్పాట్లకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రకృతిని, పూలను పూజిస్తూ తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం మున్సిపల్ పాలకవర్గం బాధ్యత అని పేర్కొన్నారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదానాలు, చెరువు పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పండుగను సామూహికంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లుఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments