పద్మనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.

పద్మనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.

*అక్టోబర్‌ 17న నిర్మాణ పనుల ప్రారంభం.*

*పది ఎకరాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం*

*తిరుమల ఆలయాన్ని తలపించేలా రూపకల్పన – స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌*

కరీంనగర్, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):

నగరంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ నెల 17న నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆదివారం టీటీడీ అధికారులతో కలిసి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయన, పనుల ప్రారంభానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఆలయ నమూనాలు, ఇతర అంశాలపై చర్చించారు.IMG-20261011-WA0019

*కేసీఆర్‌ సహకారంతో టీటీడీ అనుమతులు*

కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి అనుమతులు పొందినట్లు గంగుల కమలాకర్‌ వివరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కవిరి భాస్కర్‌రావు, వినోద్‌కుమార్‌, దామోదర్‌రావులతో కలిసి తిరుమలకు వెళ్లి టీటీడీ అధికారులతో చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు. వారి సహకారంతో ఆలయ నిర్మాణానికి అనుమతులు సాధించినట్లు పేర్కొన్నారు.

*టీటీడీ పేరిట పది ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌*

పద్మనగర్‌లో ఆలయ నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని టీటీడీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గంగుల తెలిపారు. భూమికి సంబంధించి వివిధ దశల్లో ఎదురైన అడ్డంకులను అధిగమించి నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు. 2023 మే 31న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, హోమాలు, ప్రత్యేక పూజలు చేపట్టినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం మూలవిరాట్టుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు.

*ఎన్నికలతో నిలిచిన పనులు.. ఇప్పుడు ముందడుగు*

భూమిపూజ అనంతరం నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదని గంగుల కమలాకర్‌ వివరించారు. ప్రస్తుతం నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటలలోపు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.

*తిరుమల ఆలయాన్ని తలపించేలా రూపకల్పన*

పద్మనగర్‌లో నిర్మించనున్న ఆలయ నమూనాలను ఆకర్షణీయంగా రూపొందించినట్లు గంగుల తెలిపారు. తిరుమల ఆలయాన్ని తలపించేలా ప్రధాన ద్వారం, గర్భాలయం, అర్థమండపం, ముఖమండపం, గరుడాళ్వార్‌ తదితర నిర్మాణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. సంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలిలో స్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

*కరీంనగర్‌ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం*

కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపట్టడం సంతోషకరమని గంగుల కమలాకర్‌ అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం మరింత చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.