గురువు పట్ల పూర్వ విద్యార్థుల అపారమైన ప్రేమాభిమానాలు.
*పదవీ విరమణ పొందిన గురువుకు టాటా ఎలక్ట్రిక్ కారు బహూకరించిన పూర్వ విద్యార్థులు*
*గుర్రం మహేశ్వర రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలిపిన కల్వకుంట్ల కవిత*
*గురుభక్తి, కృతజ్ఞతాభావం సమాజానికి స్ఫూర్తిదాయకం: గుంజపడుగు హరిప్రసాద్*
కరీంనగర్, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):
విద్యాబుద్ధులు నేర్పిన గురువు పట్ల పూర్వ విద్యార్థులు చూపిన అపారమైన ప్రేమాభిమానాలు, గురుభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కరీంనగర్ జిల్లాలోని డీఐఈటీ లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన గుర్రం మహేశ్వర్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్‌లో గుర్రం మహేశ్వర్ రెడ్డితో మాట్లాడి, ఆయన విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. గురువులు కేవలం పాఠాలు బోధించే వ్యక్తులు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.
గుర్రం మహేశ్వర్ రెడ్డి వద్ద విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులంతా కలిసి చందాలు వేసుకుని, పదవీ విరమణ పొందిన తమ గురువుకు టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించడం గొప్ప విషయమని కవిత పేర్కొన్నారు. గురువు పట్ల విద్యార్థులు చూపిన ప్రేమ, గౌరవం, కృతజ్ఞతాభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన గురువుల సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదని, గురువులను గౌరవించడం మన సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్నారు.
అంకితభావంతో పనిచేసిన గుర్రం మహేశ్వర్ రెడ్డి వంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గర్వకారణమని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. మహేశ్వర్ రెడ్డికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన విద్యారంగానికి, విద్యార్థులకు అందించిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా పార్టీ నాయకులు కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, బండారి అజయ్ తదితరులు పాల్గొన్నారు.


Comments