ఎల్‌నినో ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
* రైతులు రెండో పంట వేసి ఇబ్బంది పడొద్దు
* యూనిట్‌కు రూ.15 చెల్లించినా విద్యుత్తు దొరకని పరిస్థితి
* కేంద్రాన్ని కలిసి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరతాం
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
* కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంట వేసి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీడీఏ నిధులు రూ.1.63 కోట్లతోమంగలితండా–దుబ్బతండా మధ్య నిర్మించనున్న బీటీ రహదారి పనులకు, జుజ్జుల్ రావుపేటలో రూ.45 లక్షలతో చేపట్టనున్న ఓవర్‌హెడ్ ట్యాంకు, పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
మంగలితండాలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అలాగే.. హటియాతండాలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీటీసీ బదావత్ వీరన్న తండ్రి బాషూ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల శ్రీకార సభల్లో మంత్రి ప్రసంగించారు.
*రూ.15 పెట్టినా విద్యుత్తు దొరకడం లేదు*
గతంలో యూనిట్ విద్యుత్తు రూ.7, రూ.8కు లభించేదని, ప్రస్తుతం విద్యుత్తు కొరత తీవ్రంగా ఉందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. యూనిట్‌కు రూ.15 చెల్లించి కొనుగోలు చేయాలన్నా దేశంలో విద్యుత్తు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలమట్టాలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
*రెండో పంట సాగు వద్దు..*
ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. రెండో పంట వేసి, నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.
*కేంద్రాన్ని కలిసి ప్రత్యేక ప్యాకేజీ కోరతాం*
ఎల్‌నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉందని పొంగులేటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థించనున్నట్లు చెప్పారు.
*ఈ కార్యక్రమాల్లో..:* కలెక్టర్ దివాకర.టీఎస్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. హఫీజుద్దీన్, జూకూరి గోపాలరావు, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments