అక్కా.. ఎట్లున్నారమ్మా.
పత్తి చేను వద్ద కూలీలతో మంత్రి పొంగులేటి ఆత్మీయ పలకరింపు.
బ్యూరో, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
చేనులో పత్తి ఏరుతున్న వ్యవసాయ కూలీలను చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వాహనాన్ని ఆపారు. కారు దిగి వారి వద్దకు వెళ్లి.. ‘ఏం అక్కా.. ఎట్లున్నరు తల్లి.. పనులు ఎట్లా సాగుతున్నాయి.. పత్తి దిగుబడి బాగుందా?’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆర్థిక సాయం అందజేశారు. దసరా పండుగకు కొత్త బట్టలు కొనుక్కోవాలని సూచించారు.
ఆదివారం కూసుమంచిలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగించుకుని తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వెళ్తున్న సమయంలో చేగొమ్మ వద్ద ఈ ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు పక్కనే ఉన్న పత్తి చేనులో కూలీలు పనిచేస్తుండటాన్ని గమనించిన మంత్రి.. వెంటనే వాహనాన్ని నిలిపి వారి వద్దకు వెళ్లారు. తమ అభిమాన నాయకుడు ‘శీనన్న’ను చూసిన కూలీలు సంతోషంతో రోడ్డు మీదకు వచ్చారు. మంత్రి వారితో కరచాలనం చేస్తూ పలకరించి, కాసేపు ముచ్చటించారు. తమను ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం అందించిన మంత్రికి మహిళా కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. అధికారిక కార్యక్రమాల మధ్య సామాన్యులతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకున్న మంత్రి ఆప్యాయత అక్కడి వారిని ఆకట్టుకుంది.


Comments