నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సర్వం సిద్ధం.
*సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్*
*పర్యటన నేపథ్యంలో భద్రత, పార్కింగ్, సౌకర్యాలపై అధికారులకు సూచనలు*
కరీంనగర్, సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పరిపాలనా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సత్తు మల్లేశం, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్, సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ నూతన కలెక్టరేట్‌ను సమగ్రంగా పరిశీలించారు.
భవనంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, ప్రధాన ద్వారం, తెలంగాణ తల్లి విగ్రహ ప్రాంగణం, హెలిప్యాడ్, పచ్చదనం ఏర్పాట్లను వారు పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా పారిశుద్ధ్యం, భద్రత, పార్కింగ్, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చే ఈ సమీకృత కలెక్టరేట్ జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలవనుంది. ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో ఇది కీలకంగా మారనుందని డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. రేపటి ప్రారంభోత్సవం కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments