ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతలు,ఫాం పాండ్ లు .
చిల్పూర్, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి గ్రామంలో వనరుల పటం, సామాజిక పటం ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని మండల అధికారులు సూచించారు. చిల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వనరుల పటం, సామాజిక పటాలను సోమవారం అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పటాల్లో ఇళ్ల వద్ద ఉన్న ఇంకుడు గుంతలు, పొలాల చెరువులు(ఫాం పాండ్ లు), పండ్ల తోటలు తదితర వివరాలను గుర్తించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించేందుకు భూగర్భ జలాలను పెంపొందించే చర్యలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 120 రోజుల ఉపాధి కల్పించేలా అన్ని రకాల పనులను ముందుగానే గుర్తించాలని సూచించారు. గుర్తించిన పనులకు అనుగుణంగా కూలీలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో గుర్తించిన పనులకు వీబీజీ రామ్‌జీ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ ప్రసాద్, ఎంపీఓ రఘు రామకృష్ణ, ఏపీవో మోహన్ రావు, ఈసీ సింగపురం కిరణ్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments