రాజయ్య కారుకూతలు మానుకో..!
ఇందిరమ్మ ఇళ్లపై అసత్య ఆరోపణలు సిగ్గుచేటు
– సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
తన ఉనికిని చాటుకునేందుకే మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఇప్పగూడెం సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ మండిపడ్డారు. ఇప్పటికైనా కారుకూతలు మానుకోవాలని హితవు పలికారు.మంగళవారం ఇప్పగూడెంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.50 వేల చొప్పున లంచం తీసుకున్నారని రాజయ్య చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. లబ్ధిదారుల నుంచి తాము డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపిస్తే ప్రజా శిక్షకు సిద్ధమని, నిరూపించలేకపోతే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇప్పగూడెం గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయని వారు ఇప్పుడు ఇళ్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని చిన్నచిన్న పనులకు సైతం లంచాలు అడిగిన వారు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో ఇప్పగూడెం గ్రామానికి 94 ఇందిరమ్మ ఇళ్లు, రూ.2.30 కోట్ల విలువైన సీసీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన మరో నలుగురు లబ్ధిదారులకు కూడా త్వరలో ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇకపై చిల్లర మాటలతో నిరాధార ఆరోపణలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని రాజయ్యను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల మల్లయ్య యాదవ్, వార్డు సభ్యులు కత్తుల రాజయ్య, రవి, దైద ఎలిషన్, రాజు, గట్టు మల్లయ్య, కృష్ణమూర్తి, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు కత్తుల కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments