చిల్పూర్‌లో సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం.
చిల్పూర్,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ మండల కేంద్రంలోని స్థానిక విద్యా వనరుల కార్యాలయంలో ఎంపీడీవో కిరణ్ ప్రసాద్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రగతి నివేదికలను వివరించారు.
ఎంపీఓ రఘురామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను ఉచితంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ భూమిలో 120 గజాల స్థలంలో సామూహిక పారిశుద్ధ్య సముదాయాలను నిర్మించాలని తెలిపారు. ఒక్కో సముదాయం నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరవుతాయని, ఇందులో 30 శాతం మేర రూ.90 వేలను గ్రామపంచాయతీ భరించేలా తీర్మానం చేస్తే మిగతా రూ.2.10 లక్షలను స్వచ్ఛభారత్ నిధుల నుంచి విడుదల చేస్తామని వివరించారు.
గ్రామాల్లో చెత్తను తప్పనిసరిగా నాలుగు రకాలుగా వేరు చేసి సేకరించాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాధి హామీ పనుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఉద్యోగ కార్డులు లేని వారిని గుర్తించి ఉచితంగా ఉద్యోగ కార్డులు అందిస్తామని తెలిపారు.చిల్పూర్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో కిరణ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశానికి హాజరుకాని శాఖల అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
మండలంలో వివిధ రకాల తోటలను 54 ఎకరాల్లో సాగు చేస్తూ జిల్లాలో ముందంజలో ఉన్నామని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మరో 20 ఎకరాలకు రాయితీపై కూరగాయల నారు అందించనున్నట్లు వెల్లడించారు.సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నర్సింగరావు, ఏపీవో మోహన్ రావు, ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి, విద్యుత్ శాఖ ఏఈ సురేష్, ఏపీఎం నరసయ్య గౌడ్, మల్కాపూర్ వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్, సీడీపీఓ, గృహ నిర్మాణ శాఖ ఏఈ, సర్పంచులు ఎనగందుల నరసింహారెడ్డి, తీగల సాంబరాజు యాదవ్, నీల
కర్ణాకర్, గుగులోతు దేవేందర్, మల్లం రవీందర్, భూక్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments