ధ్యాన గురువు చింత అనిల్ కుమార్‌కు అభినందనలు.
ప్రజల ఆరోగ్యానికి ధ్యానం ఎంతో దోహదం: చందుపట్ల జనార్ధన్.
హుజురాబాద్, సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో తాళ్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో జ్ఞానబోధకుడు, ధ్యాన గురువు చింత అనిల్ కుమార్ నిర్వహించిన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ధ్యాన గురువు చింత అనిల్ కుమార్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా భావించి చింత అనిల్ కుమార్ గత కొన్ని నెలలుగా హుజురాబాద్ పట్టణంలో నిరంతరం ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ధ్యానం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందడంతో పాటు జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తెలిపారు. కలుషితమైన వాతావరణం, ఆధునిక జీవన విధానం కారణంగా ప్రజలు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించడం అవసరమని సూచించారు.
ప్రజలు ధ్యానం పట్ల ఆసక్తిని పెంచుకుని క్రమం తప్పకుండా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సద్గురు వంటి ధ్యాన గురువులను ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికత, ధ్యానం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు.
కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో ప్రతిరోజూ నిర్వహిస్తున్న ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, ఆకుల సదానందం, కన్నెబోయిన రాజయ్య, షీలా రాజేంద్రప్రసాద్, బజాజ్ రవీందర్ రెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో ధ్యాన పరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments