తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
రఘుపతి రెడ్డి మాజీ జెడ్పిటిసి.
పెద్దమందడి,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్ల సురేష్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మహానాడులో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వారిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఉపేక్షించరని హెచ్చరించారు.దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాలు, అమరుల బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల స్ఫూర్తిని కొనసాగిస్తూ అవసరమైతే తెలంగాణ గౌరవాన్ని కాపాడేందుకు మూడో దశ ఉద్యమానికీ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడారని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ఎస్‌కు మళ్లీ ప్రజాదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, స్వాభిమానంపై ఎవరైనా తేలికగా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments