గ్రీన్‌ఫీల్డ్ హైవే పై సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయండి.

గ్రీన్‌ఫీల్డ్ హైవే పై సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయండి.

ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి రుణాలు, ఉచిత బోరుబావులు మంజూరు చేయాలి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు 
నెల్లూరి కోటేశ్వరరావు వినతి.

ఖమ్మం బ్యూరో, మే 31(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే, రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్  క్యాంప్ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసి ఒక సమగ్ర వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న  జిల్లా ప్రజలకు సర్వీసు రోడ్లు నిర్మించడంతో పాటు, దళిత, గిరిజన నిరుద్యోగులకు ఉపాధి రుణాలు, పేద రైతులకు వ్యవసాయ బోరుబావులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పై సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరి కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నాగ్పూర్ - అమరావతి క్రాస్ నుంచి వైరా ఎగ్జిట్ వరకు ఉన్న 19.600 కిలోమీటర్ల నుంచి 33.200 కిలోమీటర్ల మార్గంలో రైతుల భూముల మధ్యలోంచి రోడ్డు నిర్మాణం  జరిగిందని వివరించారు. దీనివల్ల పొలాలు రెండు భాగాలుగా విడిపోయి, వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వెళ్లేందుకు, పండిన ధాన్యాన్ని ఇళ్లకు చేర్చేందుకు దారి లేకుండా పోయిందని , అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ భూములన్నీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమాండ్ ఏరియా కింద ఉన్నాయని, రోడ్డు నిర్మాణంతో వాగులు, కాలువలు దాటి పశువులను మేతకు తీసుకెళ్లడం ప్రజలకు, రైతులకు కత్తిమీద సాములా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించి  జిల్లా ప్రజలను  ఆదుకోవాలని ఆయన కోరారు.
నిరుపేద దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కేంద్ర బడ్జెట్ నుంచి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దినసరి కూలీలుగా ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన యువత స్వయం ఉపాధి పొందేలా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వర్తింపజేయాలని కోరారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాధారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బాలాజీ తండా గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులను మంత్రికి అందజేశారు.
అలాగే, సింగరేణి మండలం మాధారం గ్రామానికి చెందిన పేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూములకు సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రిని కోరారు. సరైన నీటి వసతి లేక, సొంతంగా బోరుబావులు తవ్వించుకునే స్థోమత లేక ఎంతోమంది పేద రైతుల భూములు బీడువారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి పథకాలైన పీఎం-కుసుమ్ , పీఎంకేఎస్‌వై  ద్వారా ఈ గ్రామంలోని అర్హులైన రైతులకు ఉచితంగా బోరుబావులు, పంపుసెట్లు మంజూరు చేయాలని విన్నవించారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో రైతుల దరఖాస్తులను పరిశీలించానని, కేంద్రం ఆదుకుంటే ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అనూహ్యంగా మెరుగుపడతాయని నెల్లూరి కోటేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
పెబ్బేరు,మే 31(తెలంగాణ ముచ్చట్లు) రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన చీరల...
జమ్మికుంటలో వర్షాకాల సన్నాహాలు.. డ్రైనేజీ నిర్మాణంపై చర్చలు.
గ్రామ గ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలి.
వడదెబ్బతో మహిళ మృతి.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఎంజీఎం మృతి.
సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు.
హుజూరాబాద్ సిఎస్ఐ చర్చిలో రెవ. జాన్ బాబు దంపతులకు ఘన వీడ్కోలు.