అంతర్జాతీయ ఐరన్‌మ్యాన్ పోటీలో వనపర్తి బిడ్డ కృష్ణ సత్తా.
వనపర్తి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐరన్‌మ్యాన్ పోటీలో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కార్వంగ కృష్ణ ప్రతిభ చాటి వనపర్తి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.గోవాలో జరిగిన ఈ పోటీలో 33 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా, కృష్ణ ఒకే రోజులో 90 కిలోమీటర్ల సైక్లింగ్, 1.9 కిలోమీటర్ల సముద్ర ఈత, 21 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసి రెండో స్థానం సాధించారని తెలిపారు.ఈ సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పదవీ విరమణ పొందిన సైనిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మిత్రుల ఆధ్వర్యంలో కృష్ణకు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ కృష్ణ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోచా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మీలో దేశానికి సేవలందించి, క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. సబిరెడ్డి వెంకట్ రెడ్డి యువత క్రీడలు, వ్యాయామంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా క్రీడా అధికారి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ గ్రామానికి, మండలానికి, జిల్లాకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.అనంతరం కృష్ణను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, కోచ్‌లు గఫార్ సింగ్, మహేష్, వెంకటరమణ, సునంద గౌడ్, ఆంజనేయులు గౌడ్, సాహితీ కళా వేదిక సభ్యులు, క్రీడాభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments