జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అడుగులు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే సౌకర్యాల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ.
జమ్మికుంట, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు కొండగట్టులో నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అనుమతుల కోసం ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ నగరంతో పాటు వివిధ మండలాల అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకురావడంలో ఎంపీ చొరవ చూపుతున్నారని తెలిపారు. వరంగల్–జగిత్యాల జాతీయ రహదారి పనులతో పాటు రైల్వే రంగంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు, మరిన్ని రైళ్ల నిలుపుదలకు చర్యలు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సరుకుల ఎగుమతులు, దిగుమతుల కోసం ప్రత్యేక వ్యాగన్ రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారని, వారి ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అక్కడ నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు కోరడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఆకుల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని పెంచి, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలుకల్పించేందుకు కృషి చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


Comments