హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్ పోలియో .
నిర్దేశిత లక్ష్యాన్ని మించి 100.2 శాతం ప్రగతి
84,816 మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు
హనుమకొండ, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. నిర్దేశించిన లక్ష్యానికి మించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 100.2 శాతం ప్రగతిని సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 84,816 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా, నిర్దేశిత లక్ష్యం 84,654 మంది కావడం విశేషం.
మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ప్రయాణ మార్గ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న తీరును పరిశీలించారు. కార్యక్రమ పర్యవేక్షణకు నియమించిన అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీని సమీక్షించారు.మూడవ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మరో 416 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 75,387 ఇళ్లను సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహించారు. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించగలిగారు.
ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సహకారం కూడా కార్యక్రమ విజయానికి దోహదపడిందని తెలిపారు.
అన్ని శాఖల సమన్వయం, సిబ్బంది అంకితభావం, సమిష్టి కృషి వల్లే నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 100.2 శాతం ప్రగతి సాధించగలిగామని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments