ఫుట్‌పాత్ లేక పాదచారుల నరకయాతన!
ఫుట్‌పాత్ లేక పాదచారుల నరకయాతన!
* మల్లాపూర్ బ్రిడ్జి ఇరువైపులా ప్రమాదకర పరిస్థితులు..
* అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం..
మల్లాపూర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం డివిజన్ మల్లాపూర్ బ్రిడ్జి ఇరువైపులా ఫుట్‌పాత్ లేకపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కన కొద్ది దూరం నడవాలన్నా ప్రమాదకరంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని రహదారి పరిస్థితులను పరిశీలిస్తే పాదచారులకు నడిచేందుకు సరైన స్థలం లేకపోవడం, పెద్ద రాళ్లు, ఎగుడుదిగుడు నేల, దట్టంగా పెరిగిన వృక్షసంపద, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పండ్ల బండ్లు తదితర అడ్డంకులు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.
ప్రతిరోజూ వందలాది, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై మలుపులు, టర్నింగ్ పాయింట్ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. వాహనాలు అతి సమీపంలో నుంచి వెళ్తుండడంతో పాదచారులు అడ్డంకులను దాటుకుంటూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ రహదారిని ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తరచుగా వినియోగిస్తున్నప్పటికీ, పాదచారుల సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమస్యపై సంబంధిత అధికారులకు అవగాహన ఉన్నప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు స్పందించి పాదచారులకు సురక్షితమైన నడక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
*
*
స్థానిక ప్రజల వివరాల ప్రకారం ఓ వయోవృద్ధుడు మాట్లాడుతూ..
పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ.. అభివృద్ధి పనులను కేవలం చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యను బట్టి మాత్రమే అంచనా వేయకూడదని, వాటి నాణ్యత, సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం కూడా నిర్ధారించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ మార్గంలో తరచుగా ప్రయాణిస్తున్నప్పటికీ, ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ సమస్యపై ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రాంతంలో ప్రముఖ సంఘసేవకుల విగ్రహాలు ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద నాయకులు సందర్భానుసారంగా వచ్చి నివాళులర్పిస్తున్నారే తప్ప, అదే ప్రాంతంలో ఫుట్‌పాత్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాలకులు, అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తనిఖీలు.. సురక్షిత ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలి
నాచారం డివిజన్ పరిధిలోని మల్లాపూర్ బ్రిడ్జి ఇరువైపులా నాచారం సర్కిల్ మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పాదచారులకు ఆటంకంగా ఉన్న అడ్డంకులను తొలగించి, నిరంతరాయంగా ఉపయోగించుకునేలా ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టి, ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
*పాదచారుల డిమాండ్ ఒక్కటే.. సురక్షితమైన నడక మార్గం!*
రోడ్డు అనేది కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా పాదచారులకు కూడా సురక్షితంగా ఉపయోగపడాలి. నివారించగల ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఉప్పల్ ఎమ్మెల్యే తక్షణమే ఈ ప్రాంతాన్ని పరిశీలించి పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Comments