రాకేష్ అన్నను విజయతీరాలకు చేర్చు మణికంఠా!
ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శబరిమలైకి అయ్యప్ప స్వాముల పాదయాత్ర
మధిర, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తమ అభిమాన నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఈసారి పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అయ్యప్ప స్వాములు పవిత్ర శబరిమలై క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన తూములూరి అరవింద్ స్వామి, పుచ్చకాయల విష్ణు స్వామి మండల కాలం పాటు అయ్యప్ప దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించి, నెత్తిన ఇరుముడి ధరించి శబరిగిరులకు పయనమయ్యారు.
ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని మణికంఠుడి సన్నిధిలో కోరుకుంటూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేష్ రెడ్డి, కమల్ రాజ్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని చేతబట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. స్వామివారి నామస్మరణతో పవిత్ర యాత్రను సాగిస్తూ తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఒకవైపు అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి, మరోవైపు తమ అభిమాన నాయకుడిపై అచంచలమైన నమ్మకంతో సాగుతున్న ఈ పాదయాత్ర పలువురి ప్రశంసలు అందుకుంటోంది. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సులు కోరుతున్నారు.


Comments