ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కేఎన్నార్ మార్నింగ్ వాక్’
అంబేడ్కర్ స్టేడియంలో వాకర్లతో మమేకమైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
కరీంనగర్, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ‘కేఎన్నార్ మార్నింగ్ వాక్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం అంబేడ్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ నిర్వహించి వాకర్లు, క్రీడాకారులతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అంబేడ్కర్ స్టేడియం వాకర్లు, క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు గతంలో సుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, అప్పట్లో కేటాయించిన సుడా నిధుల నుంచి రూ.95 లక్షలతో సింథటిక్ ట్రాక్ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
స్టేడియంలోని మరుగుదొడ్లు దెబ్బతినడంతో మార్నింగ్ వాక్‌కు వచ్చే మహిళలు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాకర్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన నరేందర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో మరుగుదొడ్ల మరమ్మతు పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ‘కేఎన్నార్ మార్నింగ్ వాక్’ నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తానని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ స్టేడియం వాకర్లు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.


Comments