క్రీడాకారులకు వాలీబాల్ కిట్, గ్రౌండ్ ఫోకస్ లైట్లు అందజేత.
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
-- వడ్డే శ్రీనివాసులు
కొత్తకోట,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనివాసులు అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ యువకులను క్రీడల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో తన మనవడు విశ్వ దేవజ్ఞ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ క్రీడాకారులకు వాలీబాల్ కిట్‌తో పాటు గ్రౌండ్ ఫోకస్ లైట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఐకమత్యాన్ని అలవర్చుతాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని యువకులకు పిలుపునిచ్చారు.అలాగే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించాలని, గురువులను గౌరవించాలని, అప్పుడే జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో సాధన చేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచించారు. గ్రామ యువత క్రీడల్లో ముందుకు సాగేందుకు తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త సాయిలు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు హోటల్ రాజు, సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, ధనుష్, డీకే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments