ధరల మంటతో పేదల బతుకులు ఆగమాగం.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై సీపీఐ సమరభేరి!
ఎల్కతుర్తి నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు భారంగా మారుతున్నాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒకవైపు రైతులు పండించిన వరి ధాన్యానికి ఆశించిన స్థాయిలో ధరలు పెరగడం లేదని, మరోవైపు ప్రజలు కొనుగోలు చేసే బియ్యం ధరలు మాత్రం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, సామాన్యులకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరారు. గోధుమలు, వంటనూనె, చక్కెర, ఉప్పు, పప్పులు, సబ్బులు తదితర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి ధరల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, గోపాలపూర్ సర్పంచ్ కర్రే లక్ష్మి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాస్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మర్రి విజయ్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్, రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టెముక్కుల మనోహర్‌రావు, సీపీఐ నాయకులు సూర మొగిలి, ఎం. మల్లయ్య, జూపాక రవీందర్, ఊటుకూరి భిక్షపతి, బోయినపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.


Comments