పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.*
*66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.*
*వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి – డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు.*
కరీంనగర్, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘చేయూత’ పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలో కొత్తగా ఎంపికైన 3,812 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పెన్షన్ పత్రాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆయా డివిజన్ల పాలకవర్గ సభ్యులతో కలిసి అందజేశారు.
నగరపాలక సంస్థకు మొత్తం 6,018 దరఖాస్తులు రాగా, వాటిలో 3,812 పెన్షన్లు మంజూరయ్యాయి. ఇందులో వితంతు పెన్షన్లు 2,180, వికలాంగుల పెన్షన్లు 1,046, ఒంటరి మహిళల పెన్షన్లు 467, చేనేత కార్మికులకు 47, గీత కార్మికులకు 72 మంజూరయ్యాయి. మరో 200 దరఖాస్తులకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో విచారణ పూర్తిచేసి అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. పెన్షన్ మంజూరు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు.
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు ఐదు లక్షల జనాభా ఉందని, గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇప్పటివరకు నగరంలో సుమారు 28,400 మందికి పెన్షన్లు అందించాయని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన అనేకమంది పేదలు దరఖాస్తులు సమర్పించి ఎదురుచూశారని, పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి పేదలకు చేయూత అందించడం సంతోషకరమని అన్నారు. పేదలకు అండగా నిలిచి చేయూత పెన్షన్లు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున అభినందనలు తెలిపారు.
అయితే, వృద్ధులను పెన్షన్ల జాబితాలో మినహాయించడం బాధాకరమని, సమాజంలో ఆదరణకు నోచుకోని వృద్ధులు ఎంతోమంది ఉన్నారని అన్నారు. వారి దరఖాస్తులను కూడా త్వరలో స్వీకరించి చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నగరంలో కొత్తగా 3,812 పెన్షన్లు మంజూరయ్యాయని, మరో 1,533 దరఖాస్తులు 360 డిగ్రీల కోణంలో పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వాటిలో 200కు పైగా దరఖాస్తుదారులు అర్హులుగా తేలినందున వారికి కూడా పెన్షన్లు మంజూరు చేసేలా కమిషనర్, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హులకు చేయూత అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments