భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
*సూర్యభగవానుడి ఆరాధనతో పాటు ప్రకృతి పరిరక్షణ, కుటుంబ సంక్షేమానికి ఛఠ్ పూజ ప్రతీక – నగర మేయర్ కొలగాని శ్రీనివాస్.*
కరీంనగర్, నవంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
సూర్యభగవానుడి ఆరాధన, ప్రకృతి పరిరక్షణ, కుటుంబ సంక్షేమం, సామాజిక మానవత్వం, మహిళల నిబద్ధత, వ్యవసాయ సంస్కృతి, సంప్రదాయాలకు ఛఠ్ పూజ ప్రతీకగా నిలుస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కార్తీకమాస శుక్లపక్ష షష్ఠి తిథి సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి చెరువు ప్రాంతంలో ఛఠ్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవాస మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా సూర్యభగవానుడు, షష్ఠి దేవికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్ఘ్యం సమర్పించారు. అనంతరం నిర్వాహకులు మేయర్‌కు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ ప్రవాస మహిళలకు, ప్రజలకు ఛఠ్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరంలో నాలుగు రోజుల పాటు ఛఠ్ ఉత్సవాలను అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించారు. నదులు, చెరువుల వంటి పవిత్ర జలాశయాల్లో స్నానాలు ఆచరించి, వివిధ రకాల వంటకాలు, రొట్టెలు, పండ్లు, పూలు, చెరకు తదితర పూజా సామగ్రిని వెదురు బుట్టల్లో ఉంచి ఛఠ్ పాటలు పాడుతూ ఉదయించే, అస్తమించే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం విశేషం.


Comments