మృతుని కుటుంబానికి గ్రామస్తుల ఆర్థిక భరోసా.
* రూ.57,500 ఆర్థిక సహాయం అందజేత.. కుమార్తె భవిష్యత్తుకు ఫిక్స్‌డ్ డిపాజిట్
ఇల్లందకుంట, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు స్నేహితులు, గ్రామస్తులు, కుల బంధువులు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బూర్ల రంజిత్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న రంజిత్ పదో తరగతి స్నేహితులు, గ్రామ యువకులు, పద్మశాలి కుల బంధువులు స్పందించి రూ.57,500 సేకరించి కుటుంబానికి అందజేశారు.
రంజిత్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మృతితో పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో స్నేహితులు, గ్రామస్తులు ముందుకొచ్చారు. సేకరించిన మొత్తం రూ.57,500లో రూ.50 వేల నగదును రంజిత్ పెద్ద కుమార్తె పేరుపై పోస్టాఫీస్‌లో పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. మిగిలిన రూ.7,500ను ఆయన భార్యకు కుటుంబ అవసరాల నిమిత్తం అందజేశారు.
కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి, పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు, గ్రామ యువకులు, కుల బంధువుల సేవలను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్ది శివకుమార్, కొక్కుల లక్ష్మీపతి, చేరాల వైకుంఠం, కురిమిండ్ల రాజు పాల్గొన్నారు.


Comments