కరీంనగర్‌లో ఘనంగా అయోధ్య రామ మందిరం థీమ్ ఎగ్జిబిషన్ ప్రారంభం.
*అయోధ్య రామ మందిరం నమూనాతో పాటు ఇండియా గేట్, గేట్‌వే ఆఫ్ ఇండియా, వాఘా బోర్డర్ థీమ్‌లు.*
*వావిలాలపల్లిలో ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు.*
కరీంనగర్, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం థీమ్ ఎగ్జిబిషన్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని కళ్లకు కట్టినట్లు కరీంనగర్‌లో థీమ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేందుకు ఈ ప్రదర్శన మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రామ మందిర నమూనాతో పాటు ఇండియా గేట్, గేట్‌వే ఆఫ్ ఇండియా, వాఘా బోర్డర్ వంటి జాతీయ ప్రతీకల నమూనాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు, దేశభక్తి పెంపొందుతాయని తెలిపారు. నగర ప్రజలు ప్రదర్శనను సందర్శించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను రూపొందించినట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా భారీ ఆర్చ్‌లు, శిల్పకళా నైపుణ్యంతో కూడిన ఆలయ నమూనాను తీర్చిదిద్దినట్లు వివరించారు. పిల్లల కోసం జెయింట్ వీల్, కొలంబస్, కార్ రేసింగ్ ట్రాక్‌లు, గేమింగ్ జోన్లు, షాపింగ్ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ సందర్శనకు ప్రవేశ రుసుము వర్తిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారి వేణు, వైద్యుల అంజన్ కుమార్, నిర్వాహకులు కిరణ్, శివాజీ, నాగరాజు, లిఖిత తదితరులు పాల్గొన్నారు.


Comments