గొర్రెలు, మేకలకు ఉచిత వైద్యం, దాణా అందించాలి!
పశువైద్యశాలల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉంచాలి
గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం డిమాండ్
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
గొర్రెలు, మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వాటికి ఉచిత వైద్యం, మందులు, దాణా, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం డిమాండ్ చేసింది.
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలో గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం ముఖ్య నాయకుల సమావేశం పెద్ది వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షుడు సాదం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జనగామ జిల్లాలోని అన్ని మండలాల్లో గొర్రెలు, మేకల పెంపకందారుల స్థితిగతులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మల్లేష్ బృందంతో కలిసి గ్రామాల్లో గొల్లకురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్యశాలల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం, అవసరమైన మందులు లభించకపోవడంతో పెంపకందారులు ప్రైవేటు మందుల దుకాణాల్లో అధిక ధరలకు మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం, వాతావరణ మార్పుల కారణంగా వచ్చే కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.గొర్రెలు, మేకలు మేత మేయడానికి ప్రభుత్వ బంజరు భూములు అందుబాటులో లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారిందన్నారు. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడితే మేత, తాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వీధికుక్కల దాడులతో గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయని, దీంతో పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.
సంఘం ప్రధాన డిమాండ్లు ఇవే..
* గ్రామీణ పశువైద్యశాలల్లో పశువైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచాలి.
* గొర్రెలు, మేకలకు అవసరమైన అన్ని రకాల మందులను ఉచితంగా పంపిణీ చేయాలి.
* కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ఉచితంగా దాణా, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి.
* వీధికుక్కల దాడుల నుంచి గొర్రెలు, మేకలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
* నష్టపోయిన గొల్లకురుమల పెంపకందారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.
గొర్రెలు, మేకల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న గొల్లకురుమల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.


Comments