ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం!
ఐకేపీ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.. మధ్యవర్తుల వ్యవస్థకు తావివ్వకూడదు: మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి నవంబర్01 (తెలంగాణ ముచ్చట్లు):
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ విమర్శించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నెలల తరబడి కష్టపడి పండించిన వరి పంటను కోసి ధాన్యం విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం చేస్తే మధ్యవర్తులు, దళారుల వ్యవస్థకు అవకాశం ఏర్పడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు, హమాలీలు, తూకం యంత్రాలు, రవాణా వంటి సదుపాయాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని కోరారు.
ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల ప్రారంభ తేదీలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.


Comments