ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
* జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన
జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని యూత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేపట్టిన మహా మార్చ్‌కు మద్దతుగా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా కాకుండా రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన స్వతంత్రతను, పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజల ఓటు హక్కు కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే విధంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం కల్పించడంలో విఫలమైన జ్ఞానేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించే ముందు సరైన విచారణ జరిపి, స్పష్టమైన కారణాలతో నోటీసులు జారీ చేయాలని కోరారు. అభ్యంతరాలు తెలిపేందుకు సంబంధిత ఓటర్లకు తగిన అవకాశం కల్పించాలని అన్నారు. ఓటు హక్కు అనేది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడినది కాదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్ల తొలగింపునకు సంబంధించి చేసిన ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్ల సంఖ్య, అందులో అనర్హులైన వారి వివరాలు, నిజమైన ఓటర్ల పరిస్థితి, అక్రమ చొరబాటుదారులుగా గుర్తించిన వారి వివరాలను గణాంకాలతో సహా ప్రజల ముందుంచాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను సమీక్షించి ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను గౌరవించాలని హితవు పలికారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడటం, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించడం, తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయడం ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వీరమనేని పరుశురాం, సుంకరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు, కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, ఒగ్గు రమేష్, చందా రాజు, తెలంగాణ ఉద్యమకారుడు అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు వాసాల రామస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పంజాల అజయ్, గొడుగు మానస, పాతకాల రమేష్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, రాచపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, మండల మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న, పిడుగు భాగ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు బండి పవన్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.


Comments