18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
యువత సమస్యల పరిష్కారమే ధ్యేయం.. కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం.
వరంగల్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ నగరంలోని 18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు) నియమితులయ్యారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి, యువత సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ప్రకటించారు.తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు అయూబ్, వరంగల్ తూర్పు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం, మాజీ కార్పొరేటర్ జన్ను రవి, డీసీసీ జనరల్ సెక్రటరీ గోరంట్ల రాజులకు బరిగెల ప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, డివిజన్‌లో యువత ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం
రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ
రేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకాష్ స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి పార్టీకి మెజారిటీ సాధించేందుకు యువజన కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని వెల్లడించారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, యువతను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ, నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు, యువజన కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు బరిగెల ప్రకాష్ (బిగ్గు) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


Comments