హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
ఎల్కతుర్తి, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధమని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన మండల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక ఎల్కతుర్తి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా న్యాయవాది గడ్డం సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లి పృథ్వీరాజ్, మండల కోఆర్డినేటర్గా సాతూరి రాజమౌళిని ఎన్నుకున్నారు.
మండల ఉపాధ్యక్షులుగా అంబాల స్వామి, జూపాక శీను, నిమ్మల మనోహర్, ఆరెపల్లి రాజయ్య, పాటి భగవాన్ గౌడ్, కార్యదర్శిగా బొంకురి కార్తీక్, సభ్యులుగా పెండ్యాల సుదర్శన్, మేకల రవీందర్లను ఎంపిక చేశారు.
నూతన కమిటీ సభ్యులకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల ప్రచారం, ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డ్యాగల సారయ్య, మేకల వీరన్న యాదవ్, చెప్పాల ప్రకాష్, సాతూరి చంద్రమౌళి, చదిరం నాగేశ్వర్, సాతూరి ప్రసాద్, మారపాక అనిల్ కుమార్, కట్కూరి రాజేందర్, జూపాక జడ్సన్, బొంకురి రవీందర్, రేణికుంట్ల సాంబయ్య, మంకయ్య, అడ్డూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments