ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ప్రకృతి సాగు పద్ధతులను వివరించిన రైతు కర్రె మురళి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్ సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, పంటల సాగు విధానాలను రైతు ఆయనకు వివరించారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వివిధ రకాల సహజ కషాయాల తయారీ, వినియోగం గురించి అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రంలోని మామిడి తోటను, గోశాలను అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు కర్రె మురళి మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పంటలు సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవడం, పశుపోషణను సాగుతో అనుసంధానం చేయడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత పద్ధతుల్లో పండించిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం, సహజ సాగు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ ఏడీఏ ఆదిరెడ్డి, ఎల్కతుర్తి ఏఈఓ పున్నం చందర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


Comments