అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం.
పెద్దమందడి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అంగన్ మిలన్ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. వారి సేవలను గుర్తించి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా చిన్నారులతో మమేకమై వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను వారి ద్వారానే అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు చిన్నారులను తమ సొంత పిల్లలుగా భావిస్తూ, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సేవలందిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.సమాజంలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారు అందిస్తున్న సేవలను అభినందిస్తూ సత్కరించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఎండోమెంట్స్ జాయింట్ కన్వీనర్ స్వాతి రెడ్డి, మన్ కీ బాత్ వనపర్తి జిల్లా కో-కన్వీనర్ అశ్విని రాధా, బీజేపీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, ఓబీసీ మోర్చా కార్యదర్శి కొత్త బుచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.


Comments