ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
బాధితుడు మాసాని సుధీర్‌కు అండగా దళిత, బహుజన సంఘాలు.
పెద్దమందడి,అక్టోబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం విషయంలో కుల వివక్షకు గురైనట్లు మాసాని సుధీర్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే ఇలాంటి ఆరోపణలు రావడంపై ఎమ్మార్పీఎస్, దళిత, గిరిజన, బహుజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని సందర్శించి బాధితుడు మాసాని సుధీర్‌కు సంఘీభావం తెలిపారు.ఈ ఘటనపై పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై జలంధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రవేశం విషయంలో వివక్ష చూపుతూ దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ డిమాండ్ చేశారు. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల పాత్రపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరికీ సమాన ఆలయ ప్రవేశ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కుల వివక్షకు తావులేకుండా సామాజిక సమానత్వాన్ని పెంపొందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత, గిరిజన, బహుజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, మొలకలపల్లి పరశురాముడు మాదిగ, మచ్చ తిరుపతి మాదిగ, వెంకట్ రాములు మాదిగ, పుట్టపాగ అజయ్ మాదిగతో పాటు పలువురు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Comments