కస్తూర్బాలో నాణ్యమైన ఆహారం అందించాలి.
కస్తూర్బా వసతిగృహాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు.
పెద్దమందడి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహాన్ని బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు సందర్శించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆహారం, అల్పాహారం, పౌష్టికాహారం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.విద్యార్థినులు కొంతకాలంగా నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని, ఉదయం అల్పాహారంతో పాటు గుడ్లు, పండ్లు, చిరుతిళ్లు, చాయ్, పాలు తదితరాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. దీంతో భోజనం, పౌష్టికాహారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు పేర్కొన్నట్లు తెలిపారు.అనంతరం వసతిగృహంలోని సరుకుల నిల్వ గదిని బీఆర్‌ఎస్ నాయకులు, వార్డు సభ్యులు పరిశీలించారు. అక్కడ నిల్వ ఉన్న టమాటాల్లో కొన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. నాణ్యత లేని కూరగాయలను వినియోగించి విద్యార్థినులకు భోజనం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించాలని కోరారు.కస్తూర్బా వంటి బాలికల వసతి విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందించడంతో పాటు నిత్యావసర సరుకుల సరఫరా, వాటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు, వార్డు సభ్యులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా బాలికల విద్యాలయాల సమన్వయ అధికారి ఇంద్రదేవితో వారు మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం సక్రమంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సేనాపతి, ఉపాధ్యక్షులు జంగం రమేష్, పురుషోత్తం రెడ్డి, అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి, సుర శ్రీనివాస్, వెంకటయ్య, మౌగిలయ్య, గుడిసె మల్లేష్, సింగిరెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు కొమ్ము బ్రహ్మయ్య, కొమ్ము విష్ణు, సింగిరెడ్డి అమల తదితరులు పాల్గొన్నారు.


Comments