కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభం
*ప్రజలకు చేరువగా పాలన.*
*తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి*
*నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన*
కరీంనగర్, సెప్టెంబర్ 30(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పరిపాలనను సులభతరం చేయాలనే లక్ష్యంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు భవన సముదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు పేదలకు నమ్మకం కలిగించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వేదిక కావాలని ఆయన పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు 
మల్లేశం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments